YSR తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
మరో పది రోజుల్లో వైయస్ షర్మిల పాదయాత్ర పునః ప్రారంభం
YSR తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు తూడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు బుధవారం రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ నాయకులు తూడి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ” పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంతమంది పార్టీకి ఈ పేరు రాకుండా చేయాలని ప్రయత్నించారని… కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోగలిగాం. పార్టీ పునః నిర్మాణంలో భాగంగా జిల్లాలకు, మండలాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ జిల్లా , మండల కార్యవర్గాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్బంగా అన్ని జిల్లాలు, మండలాల్లో , నియోజక వర్గాల్లో వేడుకలు జరపాలని నిర్ణయించామన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల.కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పాదయాత్రను రానున్న కొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభించడానికి పార్టీ సమాయత్తం అవుతోందన్నారు. అధికార పార్టీ కార్యకలాపాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.ప్రజల సమస్యల నుంచి అందరి దృష్టి మరల్చి రాజ్యాంగాన్ని మార్చాలంటూ వింత మాటలు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి మరో పది రోజుల్లో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ , పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ట రాంరెడ్డి , గట్టు రాంచందర్ రావు , సయ్యద్ ముజ్తాబా అహ్మద్ , సత్యవతి , ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.