మహిళలు ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో అన్నిరంగాల్లోనూ ముందుండాలి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

  • స్పందన ఈదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెల్ నెస్ సదస్సు ప్రారంభం

సమాజంలో మార్పు కోసం, యువతకు దిశా నిర్దేశం కోసం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ లో మూడు రోజుల పాటు జరుగునున్న వెల్ నెస్ సదస్సును ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ ఒక్కగానొక్క కూతురు పోగొట్టున్న బాధలోనూ డాక్టర్ శామ్యూల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సమాజానికి చేస్తున్న సేవకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజంలోని వ్యక్తుల సమగ్రాభివృద్ధికి మూడు రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం బాగుందని కితాబిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉండాలని సూచించారు. ఓ మహిళ రాజకీయ రంగంలో రాణించడం కష్టమైనా, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చినట్లు వివరించారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకుని, వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డైరెక్టర్ రెడ్డి శ్యామల మాట్లాడుతూ ఫౌండేషన్ తో రెండేళ్లుగా తనకు అనుబంధం ఉందని, శామ్యూల్ రెడ్డి వినూత్న పద్ధతిలో ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ తమలాగే ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకొని బాధపడుతున్నారని, వారి బాధ కొంతమేరకైనా తీర్చేందుకే ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

బెంగళూరు కు చెందిన ఎస్ హెచ్ కే వెల్ నెస్ అకాడమీ ఫౌండర్ కులకర్ణి మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో శామ్యూల్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలకు చేరవయ్యారని తెలిపారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా ఆంధ్ర మహిళా సభ పూర్వ ప్రిన్సిపాల్ జి ఎల్ కె దుర్గా వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవాధ్యక్షురాలు నిర్మల, గౌరవ డైరెక్టర్ శ్రీనివాస మూర్తి, డైరెక్టర్ ఈదా అంజిరెడ్డి ఫౌండేషన్ కోర్ కమిటీ ప్రెసిడెంటు మీరావలి, వైస్ ప్రెసిడెంట్ జ్యోతిర్మయి, జాయింట్ సెక్రటరీ ఉషా గిరి, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కృష్ణారావు, కార్యదర్శి ముప్పిడి రాజు, ఈసీ మెంబర్ భాగ్యమ్మ , జాతీయ కోర్ కమిటీ సభ్యులు మాదా చిరంజీవి, పులుగు కిషోర్ కుమార్, గుండాల శ్రీనివాసరావు, రామానుజమ్మ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *