రథసప్తమి అంటే ఏంటి..? దీని విశిష్టత ఏంటి..?

సూర్యుడే మనకు కనిపించే దేవుడు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.
‘సప్తానాం పూరణీ సప్తమీ’ అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది
ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని ‘అనూరుడు’ రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి కనుకనే ఈ పండగని రథం పేరుగల సప్తమిగా వ్యహరిస్తారు
సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథీ అంతే… కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు.
సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *