విజయ పాల ధరలు పెంచిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్

పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ రంగంలోని తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు ప్రభుత్వం ఎంతో చేయూతను అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ విజయ డెయిరీ రైతుల నుండి సేకరిస్తున్న గేదె, ఆవు పాల ధరలను పెంచడం జరిగిందని వివరించారు. లీటర్ గేదె పాలకు 4.68 రూపాయలు, లీటర్ ఆవు పాలకు 2.88 రూపాయలు చొప్పున పెంచడం జరిగిందని, పెంచిన ధరలు పిబ్రవరి 16 వ తేదీ నుండి అమలులోకి వస్తాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. రైతులకు ఇది నిజంగా గొప్ప శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలతో గేదె పాలు రూ.36.99 పై. నుండి రూ.41.64 పైసలకు, ఆవుపాల ధర రూ.29.76 పై.ల నుండి రూ.32.64 పైసలకు పెంచడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ సంస్థ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ తో 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు సంస్థ చేరుకుందని చెప్పారు. విజయ డెయిరీ నుండి ప్రస్తుతం చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులకు అదనంగా నాణ్యమైన నూతన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ ని నిర్మించడం జరుగుతుందని వివరించారు. విజయ డెయిరీ కి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ను అందజేసే కార్యక్రమాన్ని నవంబర్ 2014 సంవత్సరంలో ప్రారంభించినట్లు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇతర సహకార డెయిరీలైన నార్మూల్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ మరియు ముల్కనూరు మహిళ డెయిరీలలో పాల సేకరణ చేయుచున్న పాడి రైతులకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు, చెప్పారు. ఇప్పటి వరకు రూ.343 కోట్ల ను ఈ పథకం క్రింద పాల ఉత్పత్తిదారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. సహకారం రంగంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీ సంస్థ కు వచ్చే లాభాలను వివిధ సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి పాడి రైతులకే అందజేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పాడి పశువుల కొనుగోలుకు, విజయ పెళ్ళికానుక ఆర్ధిక సహాయం, దురదృష్టవశాత్తు పాడి రైతు మరణం సంభవిస్తే అంతిమ సంస్కార ఖర్చుల కోసం ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన, IIT, JEE లో సీటు సాధించిన విద్యార్ధులకు నగదు బహుమతి, పాటు ప్రశంసా పత్రము అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ పాలు పోసే పాడి రైతుకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందించడం ద్వారా పాడి రైతులు పాల ఉత్పత్తిని మరింత పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 1500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు. పాల క్యానులు, విద్యుత్ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా దాణా, మినరల్ మిక్చర్ మరియు ఇన్సూరెన్స్ సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి ద్వారా అర్ధికాభివృద్ధి సాధించేందుకు సన్న చిన్న కారు రైతులకు మహిళా పాల ఉత్పత్తిదారుల పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు ద్వారా, నాబార్డ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో విజయ పాడి రైతులకు ఋణాలు అందజేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. పాల ఉత్పత్తి సామర్ధ్యం పెంపుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ, సబ్సిడీ పై గడ్డి విత్తనాల సరఫరా, మారుమూల ప్రాంతాల్లోని పశువులకు 1966 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు ఆర్ధిక స్వావలంభన సాధించేలా సహకారం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పాడి రైతులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీ కి పాలు పోయడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని పాడి రైతులను మంత్రి కోరారు. అంతేకాకుండా కరీంనగర్, ముల్కనూర్, నార్మూల్ డయిరీలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *