తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజున వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే నుంచే శ్రీహరి దర్శనానికి వేచి ఉంటారు. ఈ ఒక్క ఏకాదశిని పాటిస్తే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజే సాగరమథనం నుంచి హాలాహలం, అమృతం పట్టాయని.. శ్రీకృష్ణుడు భగవద్గీతను ఇదే రోజున ఉపదేశించాడని నమ్ముతారు.

ఈరోజు ఉపవాసం చేస్తూ వైకుంఠ ఏకాదశిని ఆచరించన వారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు. ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం చేసేవారికి మరణించిన అనంతరం వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తిరుమల, సింహాచలం,విజయవాడ, యాద్రాద్రి, భద్రాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనాలు అర్ధరాత్రి 12.05 గంటలకే ప్రారంభించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.