న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషా వినియోగాన్ని పెంచాలి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ :
చట్టాల్లోని క్లిష్టమైన భాషా ప్రయోగం వల్ల సామాన్యులు అనవసరంగా డబ్బు ఖర్చుచేసి న్యాయం కోసం అటూఇటూ తిరగాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సామాన్యులకు అర్థమయ్యేలా చట్టాలు ఉంటే వాటి ప్రభావం బాగుంటుందన్నారు. ఆయన గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘చట్టాలను సామాన్యుడి భాషలో రాయడంతోపాటు, అందులోని సాంకేతిక పదాలకు విస్తృత వివరణ ఇవ్వాలి. అత్యంత నిరుపేదలు కూడా అర్థం చేసుకొనేలా చట్టాలను తయారుచేయాలి. సులభ న్యాయం విషయంలో స్థానిక భాషలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఏ పౌరుడికీ చట్టంలోని భాష బాధగా మారకూడదు. దీని కోసం ప్రతి రాష్ట్రం ప్రయత్నించాలి. మాతృభాషలో చదువుకొనే వాతావరణం కల్పించాలి. న్యాయశాస్త్ర కోర్సులు మాతృభాషలో సాగాలి. సహజ సరళ భాషలో చట్టాలు రాయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన మహత్తర కేసుల తీర్పులు స్థానిక భాషల్లో అందుబాటులోకి తేవాలి. దానివల్ల సామాన్యుడికి చట్టంపై నమ్మకం పెరగడంతోపాటు, ఈ వ్యవస్థ పట్ల భయం తగ్గిపోతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
కాలం చెల్లినవాటిని రద్దు చేయాలి : ‘‘ప్రభుత్వం లేదన్న భావన కానీ, ప్రభుత్వ ప్రభావం పెరిగిందన్న ఆలోచన కానీ ప్రజల్లో రాకూడదు. గత 8 ఏళ్లలో 1500కి పైగా అప్రస్తుత చట్టాలను రద్దు చేశాం. బానిసత్వంనాటి ఎన్నో చట్టాలు ఇప్పటికీ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అలాంటివన్నీ రద్దుచేసి ప్రస్తుత అవసరాలకు తగ్గ చట్టాలు చేయడం చాలా అవసరం. ప్రజలకు సులభ జీవనం, సులభ న్యాయం అందించే కోణంలో రాష్ట్రాల్లోని చట్టాలపై సమీక్ష జరగాలని ప్రధాని పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి
భవిష్యత్తులో ప్రపంచ అవసరాలను తీర్చగలిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. విద్యార్థుల్లో ఆసక్తులను గుర్తించి, శాస్త్రీయ దృక్పథంతో, కృత్రిమ మేధ వంటి సాంకేతికత సాయంతో వారిని మెరుగుపరచాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన ‘శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి’ (సీఎస్ఐఆర్) వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, సుస్థిరాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వలయాన్ని మెరుగుపరచడంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే దార్శనికతను సాకారం చేసుకునేందుకు శాస్త్ర సమాజం దోహదపడాలని కోరారు. తృణధాన్యాల్లో ప్రొటీన్లను పెంచడంపై దృష్టి నిలపాలనీ, ఇలాంటి ధాన్యాల్లో పోషక విలువల గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు.