తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు

గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి క్యాంటీన్ తలుపు వద్ద నిప్పు పెట్టి దుండగులు పరారయ్యారు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు దానిని గమనించి మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అన్న క్యాంటీన్ ను కాల్చాలని చూడటంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ గూండాల పనే అంటూ ఆరోపిస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసివేసింది. మరింత మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అన్నా క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలంటూ ప్రతిపక్ష నేతలు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు ఇప్పటికే మాచర్ల గొడవతో ఏపీలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ – టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరో ఘటన జరగడంతో ప్రజలు భయ పడుతున్నారు. ఎన్నికలకు సంవత్సరం నర సమయం ముందే ఇలా ఉంటే.. మునుముందు ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు.