తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్తను అందించిన టి.ఎస్.ఆర్టీసీ

రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయం

శుక్రవారం నుంచి అమలులోకి వస్తున్న విధానం

భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన ఛైర్మన్, వి.సి.అండ్ ఎం.డి

తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్‌ టికెట్‌తో పాటే తిరుమల దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పించింది.ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, టి.టి.డి (తిరుమల తిరుపతి దేవస్థానం) ల మధ్య అంగీకారం కుదిరింది.సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వి.సి అండ్ ఎం.డి వి.సి.సజ్జనార్ ప్రత్యేక చొరవతో తెలంగాణ భక్తులకు ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.

టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు.ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే బస్‌ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌నూ బుక్‌ చేసుకోవాలి. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల నుంచి తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ ఛైర్మన్, వి.సి అండ్ ఎం.డి సజ్జనార్ అన్నారు.

టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని వివరించారు.www.tsrtconline.in ఆన్ లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చంటూ కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.ఈ అవకాశాన్ని టి.ఎస్.ఆర్టీసీ బస్సులో ప్రయాణించే భక్తులు వినియోగించుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *