ఆ 10 ఏళ్లు ఒబామాను భరించలేకపోయా: మిచెల్

వైవాహిక బంధంలో తానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా అన్నారు. ఒక దశలో తన భర్త అంటే కొన్నేళ్ల పాటు తనకు నచ్చలేదని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబ జీవితానికీ సమప్రాధాన్యమిస్తూ మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే భార్యాభర్తలన్నాక గొడవలు సహజమే కదా. తాము అందుకు అతీతమేమీ కాదన్నారు మిచెల్ ఒబామా. వైవాహిక బంధంలో తనకూ గడ్డు పరిస్థితులు తప్పలేదన్నారు. ఒక దశలో అయితే ఒబామాను భరించలేని స్థితి ఎదురైందని చెప్పారు. ఇటీవల ‘రివోల్ట్ టీవీ’ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమెరికా మాజీ ప్రథమ మహిళ తన వైవాహిక జీవితం, పిల్లలను పెంచడంలో ఎదురైన సవాళ్లు తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘నా గురించి ఓ విషయం చెప్పాలి. అది చెబితే ప్రజలు నన్ను చులకనగా చూస్తారేమో. మా వైవాహిక జీవితంలో ఓ 10 ఏళ్ల పాటు నా భర్త(బరాక్ ఒబామా) అంటే నాకు నచ్చలేదు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ 10 ఏళ్లలో మా కెరీర్‌లను నిర్మించుకోవడంలో మేం బిజీగా ఉన్నాం. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్లు. ఆ సమయంలో ఎవరు ఏ పని చేయలి? స్కూల్. ఇతరత్రా విషయాల గురించి చాలా ఆందోళన చెందాల్సి వచ్చింది. వివాహ బంధం అంటే ఇద్దరు వ్యక్తులు అన్నింట్లో సగం-సగం అనేది ఎప్పటికీ జరగదు. ఒక్కోసారి నేను 70శాతం అయితే ఆయన 30 శాతం ఉండేవారు. మరోసారి ఆయన 60 శాతం..40శాతం ఇలా జరిగేది. మా పెళ్లి జరిగి 30 ఏళ్లయ్యింది. ఇందులో ఓ 10 ఏళ్లు నాకు గడ్డు కాలం ఎదురైందనే చెప్పాలి. నేను భరించలేకపోయానని మిచెల్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే వైవాహిక బంధంల్లో ఎత్తుపల్లాలు ఎదురైనా తన భర్త (బరాక్)ను చాలా గౌరవిస్తానని మిచెల్ తెలిపారు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతానని అన్నారు. ‘‘మీ వ్యక్తి ఎవరు? వారిని మీరు ఇష్టపడుతున్నారా? అనేదే ఇక్కడ చాలా ముఖ్యం. నా ఉద్దేశం ఏంటంటే ఓ మనిషిని పిచ్చిగా ప్రేమించినప్పుడు పని, కష్టం గురించి మనం ఆలోచించం’’ అని మిచెల్ తన భర్తపై ప్రేమను మరోసారి బయటపెట్టారు. 1992లో వివాహ బంధంతో ఒక్కటైన ఒబామా దంపతులు ఈ ఏడాది అక్టోబరు 4న 30 ఏళ్ల వివాహ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో బరాక్ అమెరికా అమెరికా అధ్యక్షుడయ్యే నాటికి ఒబామా పిల్లలు 10, ఏడేళ్ల వారే. తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించేందుకు తాము కౌన్సెలింగ్ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. ఇటీవలే ఈ జంట తమ బంధాన్ని మరింత దృఢంగా మల్చుకునేందుకు రెండోసారి హనీమూన్‌కు వెళ్లారట.