భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్ , రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.
భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *