ప్రపంచ పులుల దినోత్సవంను ఘనంగా నిర్వహించిన తెలంగాణ అటవీ శాఖ

అటవీ ప్రభావిత గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు…

ప్రపంచ పులుల దినోత్సవాన్ని (జూలై 29) తెలంగాణ అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు అర్థం అయ్యేరీతిలోవివరించే ప్రయత్నం చేసింది అటవీ శాఖ. పులులు ఉండటం వల్ల అడవులకు కలిగే ఉపయోగాలను, అటవీ సంపదను కాపాడుకోవటం వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అటవీ శాఖ చేసింది. ప్రధానంగా అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను, ర్యాలీలను అటవీ శాఖ అధికారులు నిర్వహించారు. పులుల రక్షిత ప్రాంతాలు అమ్రాబాద్, కవ్వాల్ తో పాటు అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, ఖమ్మం, భద్రాచలం, మెదక్, నాగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. అటవీ శాఖ పీసీసీఎఫ్ ఆర్. శోభతో పాటు, ఉన్నతాధికారులు అరణ్య భవన్ నుంచి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలను అన్ లైన్ ద్వారా పర్యవేక్షించారు. గత లెక్కల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నాయని, ప్రస్తుతం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఈ సంఖ్య బాగా పెరిగిందని, పులుల ఆవాసాల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. పర్యావరణం, ప్రకృతి రక్షణలో పులులు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయని, వాటి ఆవాసాలను దెబ్బతీయటం, వాటితో ప్రమాదకరంగా ప్రవర్తిస్తే తప్ప, పులుల వల్ల ఎలాంటి హానీ జరగదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు.

పులుల వల్ల అడవులకు కలిగే ప్రయోజనాలపై రక్షిత అటవీ ప్రాంతాలు ఉండే ప్రదేశాల్లో నేచర్ వాక్ లను, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను అటవీ శాఖ నిర్వహించింది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ తో పాటు, జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల్లో పలు కార్యక్రమాలను అటవీ శాఖ నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *