మన సైనికుల సేవలు వెలకట్టలేనివి
మనం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే కారణం వాళ్లే
సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : భారత సైనికుల ధైర్యసాహసాలు, సేవలు వెలకట్టలేనివని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు మన సైనికులు దీటుగా బదులిచ్చారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నారంటూ దానికి మన సైనికులే కారణమని చెప్పారు. సాంకేతికంగానూ మన సైనికులు ఎంతో ముందున్నారని కొనియాడారు.
కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దివస్‌కు ముందు స్నాతకోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. శిక్షణ పూర్తిచేసుకున్న 36 మంది విద్యార్థులకు గవర్నర్ ధ్రువపత్రాలు అందజేశారు. సికింద్రాబాద్‌లో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 36 మంది విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.