మన పోలీసువ్యవస్థ దేశానికే ఆదర్శం….రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
టూటౌన్ పోలీస్ స్టేషన్ కొత్తభవనం ప్రారంభం
విజయనగరం, ఫిబ్రవరి 14
ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఆంధ్రా పోలీస్…ఆదర్శ పోలీస్ అని ప్రశంసించారు. విజయనగరం పట్టణంలోని కొత్తపేట వద్ద నూతనంగా నిర్మించిన టూటౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నేతృత్వంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమమైనదిగా పేరు తెచ్చుకున్నదని కొనియాడారు. మన డిజిపి గౌతమ్ సమాంగ్ దేశంలోనే ఉత్తమ డిజిపిగా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. నేర నియంత్రణతోపాటు మహిళల రక్షణ, భద్రత మన పోలీసులకు ప్రధమ కర్తవ్యాలని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 14వేల మంది మహిళా పోలీసులను నియమించి, మహిళలు, పిల్లలపట్ల దౌర్జన్యాలు, దాడుల నియంత్రణకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. దిశ చట్టం, దిశ యాప్ మహిళల భద్రతకు భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీసు స్టేషన్‌కు రావడానికి మహిళలు భయపడేవారని, ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. పోలీసులు నీతి నిజాయితితో పనిచేస్తూ, ధర్మంవైపు నిలబడాలని పుష్ప శ్రీవాణి కోరారు.
రాష్ట్ర డిజిపి దామోదర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, పోలీసులు సేవా దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని, సామాన్యులకు సేవలందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ, ఉద్యోగాలకు వన్నె తేవాలని సూచించారు. మహిళలు, పిల్లలు, బడుగు బలహీన వర్గాలు, సామాన్యులకు సక్రమంగా పోలీసు సేవలు అందించినప్పుడే, పోలీసు వ్యవస్థ అసలు లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, రక్షణతోపాటు వారి సాధికారత కోసమే, ప్రభుత్వం మహిళా పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ లక్ష్యాల సాధనకోసం మహిళా పోలీసులంతా కృషి చేయాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతినిధిగా, మహిళా పోలీసుల పాత్ర ఇప్పుడు ఎంతో కీలకంగా మారిందని, అంకితభావంతో కృషి చేసి, శాఖకు మంచి పేరు తేవాలని డిజిపి కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఎంఎల్‌సిలు ఇంధుకూరి రఘురాజు, పాకలపాటి రఘువర్మ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ రేంజ్ డిఐజి ఎల్.రంగారావు, ఎస్‌పి దీపికా పాటిల్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.