విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు అప్పన్న తొలి దర్శనం
సింహాచలం :
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సింహాచలం అప్పన్న ఆలయాన్ని సందర్శించారు. సింహాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి అప్పన్నను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవస్థానం అధికారులు స్వామీజీకి అప్పన్న తొలి దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో అధికారులు, పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణుని దర్శించుకున్న పర్వదినమే ముక్కోటి ఏకాదశి అని తెలిపారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకునే దివ్యమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. మహా విష్ణువును ఈ పుణ్య దినం రోజున దర్శిస్తే భగవదనుగ్రహం కలుగుతుందని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. జనవరి 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే పీఠం వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రికను స్వరూపానందేంద్ర స్వామి అప్పన్న పాదాల చెంత ఉంచారు.