మాచర్లలో రణరంగం.. పరస్పర దాడులు.. టీడీపీ కార్యాలయానికి నిప్పు..?

పల్నాడు జిల్లా మాచర్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిశోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి జూలకంటి బ్రహ్మారెడ్డిని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. బ్రహ్మారెడ్డిని అక్కడినుంచి తరలించిన తర్వాత పరిస్థితులు మరింత అదుపుతప్పాయి. కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. టీడీపీ నేత దుర్గారావు కారును కూడా తగలబెట్టారు. దాదాపు మూడు గంటలకు పైగా ఈ దమనకాండ సాగింది. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ విధ్వంసం ఎక్కడి వరకు దారితీస్తుందోనని పట్టణ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *