కేంద్రం రైతుల జోలికోస్తే తెలంగాణ క్షమించదు. -కేటీఆర్‌

కేంద్రం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటి శాఖామాత్యులు కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్‌ భూతాన్ని పారద్రోలి నల్లగొండను దేశానికే ధాన్యపు కొండగా మార్చింది కేసీఆర్‌ కృషి, తెలంగాణ ప్రభుత్వ పట్టుదల అని చెప్పారు.  ప్రగతి భవన్‌లో శుక్రవారం నాడు జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో తీసుకువచ్చిన ‘‘రైతుల జోలికొస్తే ఊరుకోం’’ అన్న పుస్తకాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సాగు, తాగునీరు అందిస్తూ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలాంటి మహాత్తర పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామీణ తెలంగాణను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కోసుళ్లకొద్ది బిందెలు పట్టుకొని మంచినీళ్ల కోసం నడుస్తూ అవస్థలు పడుతున్న ఆడపడుచుల బాధలను తీర్చడం కోసమే ఇంటింటికి మంచినీళ్లు అందించే మిషన్‌ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌ నుంచే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారని ఆయన గుర్తు చేశారు.  ప్రజల అజెండానే దేశం జెండాగా చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో అడుగులు వేస్తున్నారని వివరించారు. దేశంలో కులమతాల పేరుతో, భాషా ఆదిపత్యాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్రలను తెలంగాణ భగ్నం చేసి తీరుతుందన్నారు. ఒక కులం పై మరో కులం, ఒక వర్గంపై మరో వర్గం, ఒక మతంపై మరో మతం, ఒక భాష పై మరో భాషను రుద్ది ఆధిపత్యాలను చెలాయించే విభజన వికృత సంస్కృతికి చరమగీతం పాడకపోతే దేశం అల్ల కల్లోలం అవుతుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో గత 8 ఏళ్లుగా అలుపెరుగని శ్రమతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. గ్రామీణ తెలంగాణ, పట్టణ తెలంగాణలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రగతి తీరు దేశానికే నమూనగా నిలిచిపోయిందని ఇది తెలంగాణ సమాజానికి గర్వకారణమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్థికశాఖమాత్యులు తన్నీరు హారీష్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, కౌన్సిల్‌ ఛీప్‌విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బ్రేవరీస్‌ కార్పోరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *