తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై రాష్ట్రపతితో కలిసి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం చేరుకున్న ద్రౌపదీ ముర్ముకు ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొంటారు. అనంతరం శ్రీశైలంలో ప్రసాద్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. శ్రీశైలం నుంచి సైనిక హెలికాప్టర్‌లో నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి, త్రివిధ దళాల అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సైనిక వందనం స్వీకరించిన ద్రౌపది ముర్ము అక్కడి నుంచి బోల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.
