ఏపీ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్‌

వెలిగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తోందని, దీనిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. 2017 మార్చి నుంచి 2020 వరకు వెలిగొండ విస్తరణ, అనుబంధంగా అనేక పనులను ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిందని పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జత చేశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ శ్రీశైలం నుంచి నీటి మళ్లింపునకు అనుమతించలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీనిని మొదట మూడువేల క్యూసెక్కులతో ప్రతిపాదించి తర్వాత 11,600 క్యూసెక్కులకు మళ్లించారని, అంటే రోజుకు ఒక టీఎంసీ నీటిని పంపేలా మార్పు చేశారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసిందని, అపెక్స్‌ కౌన్సిల్‌లో కూడా లేవనెత్తామన్నారు. బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ చెప్పిందని, కర్ణాటక, మహారాష్ట్రలు దాఖలు చేసిన కేసులో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్‌ క్లెయిమ్‌ చేయడానికి వీల్లేదని బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ చెప్పిందని లేఖలో వివరించారు. వెలిగొండ సహా మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టమని, నాగార్జునసాగర్‌ ఆయకట్టు, హైదరాబాద్‌ తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ఆ లేఖలో వెల్లడించారు.
తాగునీటి కేటాయింపులో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలి
తాగునీటికి వినియోగించే నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు మరోసారి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మరో లేఖ రాశారు. 1973లో జరిగిన అంతర్‌ రాష్ట్ర ఒప్పందం, బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం తాగునీటికి వినియోగించే నీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని, ఇలా తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే 31.95 టీఎంసీలు నష్టపోయామని వివరించారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరానికి 16.5 టీఎంసీలకు గాను 3.3, మిషన్‌ భగీరథకు 23.44 టీఎంసీలకు గాను 4.68 టీఎంసీలు మాత్రమే లెక్కించాలని, జాప్యం చేయకుండా వెంటనే దీన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *