తెలంగాణ ఆణిముత్యం పద్మజారెడ్డి – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

చాలా కాలం తరువాత కూచిపూడి నాట్యానికి పద్మశ్రీ తెచ్చి పెట్టిన ఘనత డాక్టర్ పద్మజా రెడ్డి కే దక్కిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ప‌ద్మ‌జా రెడ్డి తెలంగాణ ఆణిముత్యం అని.. తెలంగాణ కే గర్వకారణ‌మ‌ని ఆయ‌న అభినందించారు.హైద‌రాబాద్ రవీంద్రభారతి లో ప్రణవ్ కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యం లో ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన డాక్టర్ పద్మజా రెడ్డి కి పాదాభిషేకం చేసి స్వర్ణ కంకణం తో ఘనంగా సత్కరించారు. పద్మజా రెడ్డి శిష్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించి తమ గురు భక్తిని చాటు కోవడం గొప్ప సాంప్రదాయం, స్ఫూర్తి దాయకం అని ముఖ్య అతిధిగా విచ్చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.

ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ పద్మజా రెడ్డి కాకతీయుల నాటి నృత్య వైభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి చాటి చెప్పడం విశేషం అని అభినందించారు. పద్మజా రెడ్డి ని స్పూర్తి గా తీసుకుని తెలంగాణ కళలు విరాజిల్లేలా కళాకారులు కృషి చేయాలనీ కోరారు.

ఈవేడుక లో తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి యోగితా రాణా, తెలుగు యూనివర్సిటీ ఉప కులపతి టి.కిషన్ రావు, నాట్య గురువులు కళాకృష్ణ, రాఘవ్ రాజ్ భట్, డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ మహ్మద్ రఫీ, ప్రణవ్ తదితరులు పాల్గొని పద్మజారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ తన శిష్యులు కలసి నృత్య ప్రదర్శనల ద్వారా అభినందించడం చాలా సంతోషంగా ఉందని, తనకు లభించిన పురస్కారాన్ని గురువు దివంగత శోభానాయుడు కు అంకితం అని వివరించారు. పద్మజా రెడ్డి తన తల్లిదండ్రులు లక్ష్మి, జి.వి.రెడ్డి లను సన్మానించుకున్నారు.

ఈ సందర్భంగా పద్మజా రెడ్డి శిష్యులు ప్రదర్శించి కూచిపూడి నృత్యంశాలు ఆకట్టుకున్నాయి. పద్మజారెడ్డి జీవిత విశేషాల సమాహారం గా శిష్యులు ప్రదర్శించిన ప్రత్యేక కూచిపూడి అభినందన గీతిక ఆసక్తికరంగా అలరించింది.డి.వి.నారాయణ
మూర్తి రచన అందించగా, పావని ముట్నూరి గాత్ర సహకారం అందించారు. వేదాంతం సత్య నరసింహ శాస్త్రి నట్టువాంగం చేయగా, మృదంగం తో కర్రా శ్రీనివాస్, వయోలిన్ తో సాయి కోలంక, వేణువు తో విజయ్ కందికట్ల సంగీతం సహకారం అందించి రక్తి కట్టించారు. మురళీకృష్ణ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగా భవజ్ఞ, శర్వాణి, శ్రావణి, కనక వర్షిణి సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *