బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య బంగ్లాను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చుట్టేశారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 324 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 188 పరుగుల తేడాతో భారత్ నమోదు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 272/6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా జట్టు మరో 52 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఆటగాళ్లలో జాకిర్ హసన్ (100), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84), నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా… కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి సత్తాచాటారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహిదీ హసన్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ధాటిగా పోరాడుతున్న కెప్టెన్ షకీబల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. కాసేపటికే తైజుల్ ఇస్లాం అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అవగా.. ఎబాదత్ అహ్మద్ ను కుల్దీప్ యాదవ్ చివరి వికెట్ గా వెనక్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ను భారత్ 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 40 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈనెల 22 నుంచి మీర్పూర్ లో జరగనుంది.
