తెలుగు సహా 5 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ బోధన
న్యూఢిల్లీ
తెలుగు సహా ఐదు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహించేందుకు కొన్ని విద్య సంస్థలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు గడిచిన ఏడాదిగా టీచర్లు, ప్రిన్సిపాల్, మేధావులు, దేశపు చట్టసభల సభ్యులు ఎంతో కృషి చేశారని మోడీ చెప్పారు.
దేశ యువతకు అండగా నూతన విద్యా విధానం..
ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించబోతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విద్యా విధానం దోహదపడుతుందని, దీంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆకాంక్షించారు.
మొత్తం పరిస్థితులను కరోనావైరస్ మహమ్మారి మార్చేసినప్పటికీ.. విద్యార్థులు ఆన్‌లైన్‌లో విద్యా బోధనను త్వరగా అలవాటు చేసుకున్నారన్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారని, కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకునే సదుపాయం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్క రంగంలో తమ సత్తా చాటేందుకు భారతీయ యువత ముందుకెళ్తోందన్నారు.
డిజిటల్ ఇండియాకు కొత్త రెక్కలు
నూతన విద్యా విధానంలో మాతృభాషల్లో విద్యను అందించడం అత్యంత కీలకమని, కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనిస్తుందన్నారు. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుందని, కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరమన్నారు. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ని విప్లవాత్మకమైనదిగా చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ మీడియాకు కొత్త రెక్కలు ఇస్తున్నారన్నారు. ఇండస్ట్రీ 4.oకి భారత నాయకత్వం ఇచ్చేందుకు యువత సిద్ధమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు.