రాష్ట్రం బాగు పడాలంటే టీడీపీ పాలన అవసరం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి పెరిగింది
నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం
కర్నూలు : రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రం బాగు పడాలంటే టీడీపీ పాలన అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్ షోలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఇసుక, మద్యం, భూకబ్జాలు పెరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అన్నింటిపై ఛార్జీల మోత మోగిస్తున్నారని, ఆఖరికి చెత్తపైనా పన్ను వేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. తనని భయపెట్టాలని చూస్తున్నారన్న బాబు ప్రజలకు తప్ప తాను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారని దుయ్యబట్టారు. కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా చేస్తున్నారని, నచ్చిన ఛానళ్లను చూసే హక్కు మనకుందని తెలిపారు. ఏదైనా ఛానల్ ప్రసారాలు రాకపోతే గట్టిగా నిలదీయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నేర రాష్ట్రంగా తయారు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేవని, ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. సంపద నాశనం చేసే పార్టీ వైసీపీ అయితే సంపద సృష్టించే పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు.