నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన బాధాకరం.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు
కందుకూరులో ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కార్యకర్తలు గాయపడడంతో తన ప్రసంగాన్ని కూడా ఆపివేసి ఆస్పత్రికి వెళ్లారు. గాయపడ్డవారిని పరామర్శించారు. టీడీపీ సభలో అమాయకులు చనిపోవడం బాధాకరమని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తన సభకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్న బాబు.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఇంకొంచెం ఎక్కువగా బందోబస్తు కల్పించి ఉడాల్సిందన్నారు. టీడీపీ కార్యకర్తలు నిండు ప్రాణాలు త్యాగం చేశారంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. బాధాకర సంఘటన చోటు చేసుకున్నందుకు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రేణుల అభిమానం అదుపుతప్పి దరదృష్టకర సంఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన మనస్సును కలచివేసిందన్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇక దుర్ఘటనకు ముందే అక్కడున్న వారిని చంద్రబాబు హెచ్చరించారు. వ్యాను ఎక్కిన వాళ్లు దిగాలని పదేపదే కోరారు. బంగారు తమ్ముళ్లూ వ్యాన్ దిగాలంటూ కోరారు. సభ సక్సెస్ కావాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు చంద్రబాబు సూచన పట్టించుకోకపోవడంతో.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.