స్విమ్స్ ను దేశంలో అత్యుత్తమ ఆసుపత్రుల స్థాయికి తీసుకురావాలి : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

 దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రుల జాబితాలోకి స్విమ్స్ తీసుకురావడానికి కృషి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన వసతులన్నీ సమకూరుస్తామని చెప్పారు.
 స్విమ్స్ ఆసుపత్రి, శ్రీ పద్మావతి వైద్య కళాశాల పై శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇన్స్యూరెన్స్ సంస్థలతో కుదుర్చుకున్న నగదురహిత వైద్యం కు సంబంధించిన బిల్లులు సంబంధిత సంస్థలు మూడు నెలల్లోగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆలస్యం చేస్తే నిర్ణీత శాతం మేరకు వడ్డీ వసూలు చేసే పద్ధతి అమలు చేయాలని చెప్పారు. ఈ విషయం ఆయా సంస్థలకు తెలియజేసి బకాయిల వసూలు పై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. స్విమ్స్ లో సర్జరీల ధరల నిర్ణయానికి సీనియర్లతో కమిటీ వేయాలని చెప్పారు. ఈ కమిటీ ఇతర ఆసుపత్రుల్లో అధ్యయనం చేసి పెంచాల్సిన చోట పెంచడం, తగ్గించాల్సిన చోట తగ్గించడం చేయాలన్నారు. స్విమ్స్ల్ లో ఇటీవల ప్రారంభించిన 35 పేయింగ్ గదుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మిగిలిన 65 గదులను ఈ నెల 15 వతేదీకి అందుబాటులోకి తేవాలని సూచించారు. బిల్లింగ్, చికిత్సలకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. దీని నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఈవో చెప్పారు. కార్డియాలజి, న్యూరో సర్జరి, ఆంకాలజి విభాగాలను మరింత పటిష్టం చేసి దక్షిణాది లో అత్యుత్తమ సేవలు అందించే స్థాయికి తేవాలన్నారు. వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలు సేకరించాలని, ఇది స్విమ్స్ సిబ్బంది కాకుండా ఇతరులతో జరిపించాలని సూచించారు. ఆసుపత్రి ఓపి కోసం వచ్చే రోగులు, సహాయకుల వసతి కోసం హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
  శ్రీపద్మావతి వైద్య కళాశాల దేశంలో 28వ ర్యాంక్ లో ఉందని, దీన్ని టాప్ 10 లోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కళాశాలలో డిజిటల్ తరగతులు జరిగేలా, విద్యార్థులు ఇతర ప్రముఖ వైద్య కళాశాల ల అధ్యాపకుల తరగతులు వినేలా సాంకేతిక ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలని, అంతర్జాతీయ జర్నల్స్ లో వ్యాసాలు ప్రచురితమయ్యేలా కృషి జరగాలని ఈవో సూచించారు. వైద్య కళాశాల బోధన తీరుపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధన, శిక్షణ కు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న శ్రీపద్మావతి వైద్య కళాశాల హాస్టల్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
  అనంతరం శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. భవనాలు, వైద్య పరికరాల ఏర్పాటు అంశాలపై అధికారులతో చర్చించారు.
  ఈ సమీక్షలో జెఈవో వీరబ్రహ్మం, ఎఫ్ ఏ సి ఏవో బాలాజి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ , పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, స్విమ్స్ ఎం ఎస్ డాక్టర్ రామ్, టీటీడీ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *