ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి ఆశీస్సులు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి

     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి ఆశీస్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా శ్రీ నివాస కల్యాణాలు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.


    హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగిన వైభవోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి జరిగిన శ్రీనివాస కళ్యాణంలో టిటిడి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి హైదరాబాద్ లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ముందుకొచ్చిన దాతలు హర్షవర్ధన్‌, ఎస్‌ఎస్‌.రెడ్డి,  వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి కుటుంబాలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. పాల్గొన్న భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటున్నానని చెప్పారు.

   దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం జరుగుతోందని, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వెనకబడిన, గిరిజన ప్రాంతాల్లో 570 ఆలయాల నిర్మాణం చేపట్టామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న కాలంలో 2 వేల ఆలయాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. దాతల సహకారంతో ప్రతి జిల్లాలోనూ వైభవోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో నెల్లూరులో ఘనంగా వైభవోత్సవాలు నిర్వహించామన్నారు. త్వరలో ఒంగోలులో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలియజేశారు.

  జూలై, ఆగస్టు నెలల్లో అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించామని, శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ నెల 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు యూరప్ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీవారి కళ్యాణాలు  నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *