క్యాన్సర్‌ విజేతలను సత్కరించిన సింగరాజు క్యాన్సర్‌ ఫౌండేషన్‌

హైదరాబాద్‌:

క్యాన్సర్‌ బారినపడి కోలుకున్న పలువురు మహిళలను సింగరాజు క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఘనంగా సత్కరించింది. శనివారం బంజారా హిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో ‘మహిళా ఛాంపియన్స్‌’ పేరుతో ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఎఎస్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, నారాయణ్‌పేట్‌ కలెక్టర్‌ దాసరి హరిచందన, ఏపీ అండ్ తెలంగాణ బ్రిటీష్‌ హై కమిషన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డా. అండ్రూ ఫ్లెమ్మింగ్‌, ఎన్‌ఆర్‌ఐ, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఝాన్సీ
రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ అంకాలజిస్టు, సింగరాజు క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ మల్లిక్‌ సింగరాజు సమక్షంలో అతిథులు క్యాన్సర్‌ను జయించిన ముగ్గురు మహిళలు… రాజేశ్వరి సుబ్రమణియన్‌, షిప్రా కృష్ణ, అర్చన అర్ధపుర్కర్‌లను సత్కరించారు.

ఆత్మవిశ్వాసం,దృఢసంకల్పంతో క్యాన్సర్‌కు చికిత్స పొంది ఆరోగ్యవంతులైన మహిళల అనుభవాలను పంచుకోవడం ద్వారా క్యాన్సర్‌ రోగులలో అవగాహన, మనో ధైర్యం నింపేందుకు సింగరాజు ఫౌండేషన్‌ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని
డాక్టర్‌ మల్లిక్‌ సింగరాజు అన్నారు. రొమ్ము క్యాన్సర్‌ విషయంలో ఆసియాలో కెల్లా భారతదేశం 6వ స్థానంలో, ప్రపంచంలో 10వ స్థానంలో ఉందని తెలిపారు. అలాగే యేటా 1,22,844 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతుండగా, 67,477 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని చెప్పారు. ‘నేను క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళకు విజయవంతంగా చికిత్స చేసినప్పుడల్లా, నా వైద్య వృత్తికి నేను న్యాయం చేశానని భావిస్తాను’ అని ఆయన చెప్పారు. క్యాన్సర్‌పై గెలవడం ఇప్పటికీ అత్యంత సవాలుతో కూడుకున్నదన్నారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించే ఆస్పత్రులు అందుబాటులో ఉండటంతో పాటు చికిత్స కయ్యే ఖర్చును భరించే స్థోమత ఉందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరైన ఆస్పత్రులు, అవగాహన, ఆర్థిక స్థోమత నుంచి ఎంతో దూరంలో ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *