విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు

ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?

విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష

విద్య, వైద్య, వ్యసాయం రంగంలో విప్లవాత్మక మార్పు

జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష

*అమరావతి :

పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యాశాఖ అధికారులు వివరించారు. నాడు-నేడు కింద పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.1120 కోట్లు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుకను అందించేలా కచ్చితమైన ప్రణాళిక వేసుకున్నామని, ఇప్పటికే టెండర్లు ప్రక్రియ ప్రారంభించామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నామని, క్రమం తప్పకుండా నివేదికలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే స్కీంకు సంబంధించి ట్యాబ్‌లు రావడం మొదలయ్యిందని అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ట్యాబ్‌లు వచ్చాక దాంట్లోకి కంటెంట్‌ను లోడ్‌ చేసే పనులు కూడా వెంటనే మొదలు కావాలని సీఎం అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్‌పై వారికి అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాక బైజూస్‌ ఇ–కంటెంటును 4 వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అందిస్తామన్నారు. ట్యాబ్‌లు పొందిన వారు కాకుండా ఈ తరగతులకు చెందిన మిగిలిన విద్యార్థులు కూడా అందుబాటులోకి తీసుకు రావడానికి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంటును డౌన్‌లోడ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్‌ పొందుపరచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డిజిటల్‌ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్‌ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్‌ అందుబాటులో ఉంటుందన్న సీఎం ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్లో బయట వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా వారి వారి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తూ దీన్నికూడా వక్రీకరించి కొన్ని మీడియ సంస్థలు కథనాలు రాస్తున్న విషయంపై సమావేశంలో ప్రస్తావన కొచ్చింది. విద్యా సంబంధిత కార్యక్రమాలు, వారికి మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమన్న సీఎం అన్నారు. స్కూలు పిల్లలనుకూడా రాజకీయాలను నుంచి మినహాయించడంలేదని, వారిని కూడా అందులోకి లాగుతున్నారని సీఎం అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, స్టేట్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ మనోహరరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌(ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *