అవయవదానంపై అవగాహన పెంచడం అత్యవసరం: సీపీ అంజనీకుమార్
హైదరాబాద్
సరైన సమయానికి శరీరంలో పాడైన అవయవాల స్థానంలో వాటికి సరిపోయే అవయవాలను అమరిస్తే ప్రతియేటా వేలాది మరణాలు సంభవించకుండా నివారించవచ్చుని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ అని.. మరణం తర్వాత అవయవదానానికి చాలామంది ముందుకు రావట్లేదన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంను పురస్కరించుకుని లక్డీకపూల్ లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి హైదరాబాద్ నగర పోలీసులతో కలిసి అవయవదానంపై అవగాహన పెంపొందించేందుకు ఒక కార్యక్రమం నిర్వహించింది.
అవయవాల మార్పిడి సమయంలో వాటిని శరవేగంగా తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నగర పోలీసులు (శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలు రెండూ) చేస్తున్న కృషిని ఆసుపత్రివర్గాలు ప్రశంసించాయి. ప్రజల ప్రాణాలు కాపాడటంలో వారి సేవలకు గుర్తింపుగా గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను సత్కరించింది. సరైన సమయానికి అవయవాలను చేర్చడంలో నగర పోలీసుల కృషి మరువలేది. సీపీ తో పాటు అదనపు కమిషనర్ (శాంతిభద్రతలు) డి.ఎస్. చౌహాన్, అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్లనూ సత్కరించారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ, “తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి అవయవదానం ఒక్కటే ఏకైక ఆశ! మరణానంతరం అవయవాలు దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాదు, ఆ అవయవాలు స్వీకరించినవారి రూపంలో ఇచ్చినవారు మరికొన్నాళ్లు జీవిస్తారని తెలిపారు. అవయవాలకు తీవ్రమైన కొరత ఉందంటే కోట్లాది మంది ప్రజలు ఇంకా బాధపడుతూ జీవిస్తున్నారని అర్థం. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇక రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. మరణానంతరం అవయవాలు దానం చేస్తామని ప్రతినబూనేవాళ్ల వల్లే వారి బాధలు తీరుతాయి” అని చెప్పారు.
లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఈవో గౌరవ్ ఖురానా మాట్లాడుతూ
“అవయవ దానం విషయంలో సమయం చాలా కీలకమైనదన్నారు. అవయవాలను దాత నుంచి గ్రహీత వద్దకు సరైన సమయానికి చేర్చడంలో హైదరాబాద్ నగర పోలీసులు చాలా సందర్భాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారని… విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది నుంచి ఈ సహకారం అందకపోతే గ్రహీతల వద్దకు అవయవాలను సరైన సమయానికి చేర్చడం మాకు చాలా కష్టం అవుతుందన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ మాకు అందిస్తున్న సహకారానికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశంలో కేవలం 3% మందే అవయవదానానికి పేర్లు నమోదు చేసుకుంటున్నారని.. యూరోపియన్ దేశాలు, అమెరికాతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఈవో గౌరవ్ ఖురానా అన్నారు. ఏటా 1.5-2 లక్షల మందికి మూత్రపిండాల మార్పిడి అవసరమైతే కేవలం 8,000 (4%) మందికే అవి అందుతున్నాయన్నారు. అలాగే మొత్తం 80,000 మందికి కాలేయ మార్పిడి అవసరం కాగా, 1,800 మందికే లభిస్తున్నాయని.. లక్ష మందికి కార్నియా మార్పిడి అవసరమైతే వారిలో సగం మందికంటే తక్కువకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెసమస్య ఉన్నవారిలోనూ 10,000 మందికి గుండెమార్పిడి అవసరం అవుతుంటే 200 మందికే దాతలు లభ్యమవుతున్నారని… ఈ కొరతకు అవయవదానం విధానంపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు.