తెలంగాణలో వరద నివారణ పై అవగాహన పెంపొందించుకోవాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్
మారిన పరిస్థితుల్లో.. తెలంగాణ లో ఇక నుంచి కరువు పరిస్థితులు వుండవని, వరద పరిస్థితులను ఎదుర్కునే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉన్నతాధి కారులకు సీఎం సూచించారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ తక్షణమే ” వరద పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలో తెలిసిన ఏడుగురితో కూడిన సమర్థవంతమైన వరద నిర్వహణ బృందం” ( ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్) ను ఏర్పాటు చేయాలి. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలమీద అవగాహన కల్పించబడిన ఉన్నతాధికారులను నియమించాలి. ఈ టీం ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా.. పాత రికార్డ్ ను అనుసరించి ఆయా వరదల సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టేలా, ప్రతి సంవత్సరం వరదల రికార్డ్ ను పాటించాలి’’ అని సిఎం అన్నారు.
ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీంలో నియమించబడే అధికారులకు ఉండాల్సిన అవగాహనను సిఎం ఈ సందర్భంగా వివరించారు. వారు, ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవిన్యూ, వైద్యశాఖ, జీఎడి శాఖల గురించిన అనుభవం కలిగిన వారై ఉండాలన్నారు. ఈ సభ్యుల్లో వొకరు., లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ వారికి తక్షణ పునరావాస క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి వున్నవారై వుండాలన్నారు.
ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ తదితర రక్షక వ్యవస్థలను అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను ఆదుకునేందుకు సమయస్పూర్తితో వ్యవహరించగలిగే వొక అధికారి ఉండాలని సిఎం అన్నారు.వైద్య శాఖ , రోడ్లు భవనాల శాఖ పంచాయితీ రాజ్ శాఖ ను సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితుల్లో యుద్ద ప్రాతిపదికన వ్యవహరించే అనుభవం వున్న అధికారిని వొకరిని నియమించుకోవాలన్నారు. అదే సందర్భంలో.. ప్రభుత్వ చర్యలను సమీక్షించుకుంటూ తక్షణ ఆదేశాలు వెలువడేలా ఉన్నతాధికారులతో వ్యవహరిస్తూ.. జీ ఏ డి, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ఫ్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారి మరొకరుండాలన్నారు. ఇట్లా వరద పరిస్తితిని ఎదుర్కునేందుకు, అనుభవం కలిగిన శిక్షణ పొందిన అధికారులతో కూడిన, ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు.
వానలు వరదల పరిస్థితి పై సమీక్ష…పరిస్థితుల గురించి ఆరా…తక్షణ ఆదేశాలు :
గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాలలో భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీ పై నుంచి మొదలుకుని కడెం, ఎల్లంపెల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో పాటు , కృష్ణ ఎగువన వరద పరిస్థితిని అధికారులు సీఎం కెసిఆర్ కు ఈ సందర్భంగా వివరించారు.
గోదావరికి వరద ఉదృతి పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యం లో సిఎస్ సోమేశ్ కుమార్ సహా
నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన సిఎం కెసిఆర్ రక్షణ చర్యలకోసం పలు ఆదేశాలు జారీ చేశారు. భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ప్రారంభించిందని సిఎం ధైర్యం చెప్పారు.
తక్షణమే కొత్తగూడెం, ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు, ఆర్మీ చాపర్ లో సీనియర్ అధికారులను పంపించాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలని,. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న గోదావరి తీర ప్రాంతాల్లో నిరాశ్రయులకు, షెల్టర్, బట్టలు, భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలకు సమావేశం నుండే సిఎం కెసిఆర్ పలు ఆదేశాలు జారీ చేసారు.