తెలంగాణలో 23న రాహుల్ భారత్ జోడో యాత్ర : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్:
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారయింది. ఈనెల 23న రాహుల్ గాంధీ యాత్ర కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై రాహుల్ యాత్రపై సమీక్షించారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించినట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 31న జోడోయాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందని తెలిపారు.
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో బహిరంగా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరువు, ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్దునూర్ ప్రాంతాల మీదుగా జోడోయాత్ర కొనసాగుతుందని వివరించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు.