పోర్టులకు అప్పు ఇచ్చే సమయంలో జాగ్రత్త

కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ఛైర్మన్లకు రఘురామకృష్ణరాజు లేఖ

న్యూఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ-రుణ నిష్పత్తి 75%కి మించిపోయిందని, ఇలాంటి సమయంలో రాష్ట్రంలో భావనపాడు, మచిలీపట్నం, రామయపట్నం పోర్టులకు ఇచ్చే రుణాలను దారి మళ్లించకుండా కేవలం వాటి పనుల కోసమే ఉపయోగించేలా ముందస్తు షరతులు విధించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర విద్యుత్తు శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ పోర్టులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఆర్‌ఈసీలు రుణాలు ఇవ్వడానికి సుముఖత చూపుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ రెండు సంస్థల ఛైర్మన్లు, కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌కు లేఖలు రాశారు.

‘‘భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైం బోర్డుకు రూ.5వేల కోట్లు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8వేల కోట్లు రుణం మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మీరు ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ ద్వారా తీసుకున్న రుణం రూ.9,03,436.58 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 75%కి సమానం. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు ఉంటే రుణం-వడ్డీల కింద రూ.55వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర రెవెన్యూ లోటు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా రూ.35 వేల కోట్ల నుంచి రూ.48 వేల కోట్ల దాకా ఉంది. తాజా ఆర్థిక సంవత్సరంలో అది రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితులను దాటినట్లు ఆర్‌బీఐ హెచ్చరిక లేఖలు కూడా రాసింది. గత మూడున్నరేళ్లలో ప్రభుత్వం రూ.2లక్షల కోట్లకుపైగా అప్పు తీసుకొని దాన్ని రెవెన్యూ, ఆర్థికలోటు భర్తీకి వాడుకొంది. ఈ నేపథ్యంలో మీరు ఏ రుణం మంజూరు చేసినా దాన్ని సంబంధిత పోర్టు పనుల కోసం మాత్రమే ఉపయోగించేలా జాగ్రత్త పడాలని రఘురామకృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *