మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవటమే తెలుగు వారిగా మన గౌరవాన్ని పెంచుతుంది : ముప్పవరపు వెంకయ్యనాయుడు
మన భాష, సంస్కృతులకు వారధులుగా, ముందుతరాలకు అందజేసే సారధులుగా ప్రవాస భారతీయుల తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ఆనందదాయకం
మనవైన కుటుంబ విలువలను మన ముందు తరాలకు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలి
సంస్కృతిలో భాగమైన జీవన విధానం, విశ్వాసం పురోగమించాలే తప్ప, తిరోగమనం చెందకూడదు
భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతం అవుతాయి
మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు
విభిన్న సంస్కృతుల మధ్య తెలుగు వారి గౌరవాన్ని కాపాడుతున్న మలేషియా తెలుగు సంతతి ప్రజలకు అభినందనలు
మలేషియా : మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింప జేస్తుందని, ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని భారతదేశ పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మలేషియా తెలుగు సంఘాన్ని అభినందించారు. ఈ సందర్భంగా 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డి తో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా మన భాషకు, సంస్కృతికి వారధులుగా, ముందు తరాలకు అందజేసే సారధులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుండటం ఎంతో ఆనందదాయకమన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు సంప్రదాయమంటే చక్కగా అందించటమని తెలిపారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించటం గురించి ప్రస్తావించిన ఆయన, ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ప్రాచీన భారతదేశం కళలకు కాణాచిగా విరాజిల్లిందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారతీయుల గొప్పతనం గురించి ఐన్ స్టీన్, మార్క్ ట్వైన్ లాంటి వారు చెప్పిన విషయాలను గుర్తు చేశారు.
బ్రిటీష్ వారి పాలనలో మన సంస్కృతిని కూలదోసే ప్రయత్నాలు జరిగినప్పటికీ, బలమైన మన సాంస్కృతిక పునాదుల్ని కదల్చలేకపోయాయని తెలిపారు. అలాంటి విలువలను మనం కాపాడుకోవాలని సూచించిన ఆయన, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే అది మన భాషను కాపాడుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందన్నారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్న వెంకయ్యనాయుడు, వాణిజ్య బంధాలు, సాంస్కృతిక బంధాలుగా మారి, రెండు సంస్కృతుల మధ్య చక్కని వంతెన వేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు.
మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.