ఫిబ్ర‌వ‌రి20 వ తేదీన విశాఖ‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాక

ఈనెల 21న జరిగే పీఎఫ్‌ఆర్‌ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా సాదర స్వాగతం పలక‌నున్నారు.

ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రపతి బసచేస్తారు. 21న ఉ.9 గంటలకు ఫ్లీట్‌ రివ్యూ మొదలుకానుంది. 11.45 వరకూ జరిగే ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలతోపాటు సబ్‌ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లని నాలుగు వరుసల్లో నిలుపుతారు. వీటిని త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి యుద్ధనౌకలో నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో తమ గౌరవ వందనాన్ని అందజేసేందుకు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్‌ చేస్తాయి. అనంతరం పీఎఫ్‌ఆర్‌కు సంబంధించిన తపాలా బిళ్లని, పోస్టల్‌ కవర్‌ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు.

25 నుంచి మిలాన్‌ మెరుపులు

ఇక పీఎఫ్‌ఆర్‌ తర్వాత 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలను బలోపేతం చేసేలా మిలాన్‌–2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. నిజానికి 1995లో మిలాన్‌ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 17 దేశాలు పాల్గొని అతిపెద్ద ఫ్లీట్‌ రివ్యూగా చరిత్రకెక్కింది.

27న ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌

మరోవైపు 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా మిలాన్‌ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీటైమ్‌ సెమినార్‌ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్‌ జయశంకర్‌ హాజరవుతారు. 27 సా.4.45కు విశాఖ బీచ్‌రోడ్డులో జరిగే ఆపరేషనల్‌ డిమాన్‌స్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖని సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *