మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోంది : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవకుండా మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెరాస, బీజేపీ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కుట్ర చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య చర్చ ఉండేలా ప్రజలను రెచ్చగొడుతున్నాయి. మునుగోడుతో పాటు నల్గొండ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అది కూడా పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలోనే జరిగింది. తెరాస, బీజేపీ వ్యూహాత్మక రాజకీయ కలయికతో కాంగ్రెస్ మొదటి స్థానంలో గెలవొద్దని, రెండో స్థానం కూడా రావొద్దని కావాలనే ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మునుగోడు ఓటర్లు గమనించాలి. సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్‌మెంట్ తెరాస, బీజేపీ కి ఉండదు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినవారవుతారు. ఒక ఎకరం ఉన్న రైతుకు వచ్చే రైతు బంధుతో ఆ కుటుంబం ఏడాది మొత్తం బతకలేదు. రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం, ఆర్థిక సహకారం అందిస్తేనే రైతుకుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇలాంటి పని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే కుటుబం కాంగ్రెస్‌ది. ఇది మునుగోడు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. బీజేపీ మతం పేరుతో తెరాస ఆశపెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. 10 రోజుల సంతోషంతో సంతృప్తి పడతారో, భవిష్యత్ అభివృద్ధికి దోహద పడతారో మునుగోడు ప్రజల ఇష్టం. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నిరంతరం సంతోషం వచ్చే పరిస్థితులు వస్తాయి. డబ్బులు ఎవరిచ్చినా మీ డబ్బే కాబట్టి తీసుకోండి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండని జగ్గారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.