ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం ఫ్లెక్సీలు ఏం సూచిస్తోంది? : పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని, కానీ ఏపీలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందని పవన్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చివేసి, ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని జరుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ సీఎంకి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని పవన్ పేర్కొన్నారు. 9 దశాబ్దాల పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవి అని ప్రశ్నించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సీఆర్ రెడ్డి వంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలుగా నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్రా విశ్వవిద్యాలయం అని అభివర్ణించారు. ఆ విద్యావనం నుంచి ఎంతో మంది మేధావులు వచ్చారని, అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
