పారిశుధ్య పనుల్లో కొత్త టెక్నాలజిని వినియోగించాలి:జలమండలి భద్రతా పక్షోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జలమండలి మురుగునీటి నిర్వహణ, కార్మికుల భద్రత పై నిర్వహిస్తున్న భద్రతా పక్షోత్సవాలలో భాగంగా మారేడ్ పల్లి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని.. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుందని, పెరుగుతున్న జనాభా తాగునీటి అవసరాలను తీర్చడానికి జలమండలి కృష్ణా, గోదావరి నదుల నుండి తాగునీటిని తరలించి నగరవాసులకు సరఫరా చేస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీతో పాటు, ఓఆర్ఆర్ లోపల 193 గ్రామాలకు సైతం జలమండలి తమ సేవలను విస్తరించిందని గుర్తు చేసారు. 2014 కు ముందు వేసవికాలంలో తాగునీటి కోసం నిత్యం ధర్నాలు జరిగేవని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా అలాంటి సంఘటనలు జరగలేదన్నారు. ఒకప్పుడు మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఎయిర్ టెక్ మిషన్ ఉండేదని, కానీ నేడు ఒక నియోజకవర్గానికి ఐదారు మిషన్లు ఉన్నాయని, దీనివల్ల పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
మ్యాన్ హోల్ పూడికతీత పనుల్లో మానవ ప్రమేయం లేకుండా కొత్త టెక్నాలజిని అవసరమైన చోట్ల వినియోగించాలని తెలిపారు. మురుగునీటి నిర్వహణలో పారిశుధ్యకార్మికుల భద్రతకు అత్యంత ప్రాదాన్యం ఇవ్వాలన్నారు. ఎందుకంటే ఒక కార్మికునికి ప్రాణ నష్టం జరిగితే ఒక కుటుంబం మోత్తం బాధపడాల్సివస్తుందని తెలిపారు. ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ విధానానికి చరమగీతం పాడాలని అన్నారు. దీనికోసం రోబోటిక్ టెక్నాలజీతో మ్యాన్ హోళ్ళను శుద్ధి చేసే ప్రక్రియను ఇప్పటికే సనత్ నగర్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని, ఇది విజయవంతమైందని.. త్వరలోనే నగర వ్యాప్తంగా దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరో వైపు ప్రజలు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తా చెదారం వంటివి మ్యాన్ హోళ్ళలో వేయకుండా వేయకుండా బాధ్యత వహించాలన్నారు. మురుగునీటి నిర్వహణలో తమవంతు సహకారం అందిచాలన్నారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో జలమండలికి పోటీగా దేశంలో ఏ నగరం కూడా దరిదాపుల్లో కూడా రాదని కొనియాడారు. అంతేకాకుండా జలమండలికి ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయని.. ఎండీ దాన కిశోర్ సారథ్యంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జలమండలి ఎండీ దాన కిశోర్ మట్లాడుతూ.. మురునీటి నిర్వహణలో దేశంలో ఉన్న ఇతర ప్రధాన నగరాల కంటే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నగరంలో తొమ్మిది వేల కిలో మీటర్ల మేర సీవరేజి పైపు లైన్ వ్యవస్థ, 25 ఎస్టీపీలు ఉన్నాయని, నగరంలో రోజూ ఉత్పన్నమవుతున్న మురుగులో మొత్తం 772 ఎంఎల్డీల మురుగునీటిని 94 శాతం వరకు శుద్ధి చేస్తున్నట్టు వివరించారు. వీటిని గార్డెనింగ్, భవన నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో పునర్వినియోగానికి వీలుగా శుద్ధి చేస్తున్నట్లు వివరించారు. పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణపై, అవగాహన కల్పించడానికి, వారి భద్రతే లక్ష్యంగా ఈ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమని వివరించారు. కార్మికుల భద్రత కోసం ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. మ్యాన్ హోళ్ళ ను శుభ్రపరిచే కార్మికుల కోసం ప్రత్యేకంగా రెండు లక్షల వ్యయంతో తేలికపాటి బాడీసూట్ ని కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
జలమండలి పరిధిలోని ఆరు సర్కిళ్ళలో ప్రతీ సర్కిల్ కి “స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్” ను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీమ్ లో ఏడుగురు అధిక నైపుణ్యం గల కార్మికులు ఉంటారని వివరించారు. వీరు సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే సీవరేజి పనుల సమయంలో.. భద్రతా పరికరాల వినియోగం, పారిశుధ్య నిర్వహణలో ఉపయోగించే పరిజ్ఞానంతో పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మురుగునీటి నిర్వహణ, భద్రత పై క్షేత్ర స్థాయిలో ప్రజలకు సైతం అవగాహన కల్పించడానికి ప్రజాప్రతినిధులను, ఎన్జీవోలను, ఇతర సంఘాలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవల్ని గుర్తిస్తూ, వారికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు.
అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పలువురు కార్మికులను ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు. పారిశుధ్య పనులు చేసేముందు ప్రతీ కార్మికుడు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని, రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగిస్తామని.. పారిశుధ్య కార్మికుల కోసం రూపొందించిన ఈ ప్రతిజ్ఞను మంత్రి, ఎండీ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మేల్యే జి. సాయన్న, కార్పోరేటర్లు, జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు ప్రభు, ప్రసన్న కుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షలు రాంబాబు యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.