తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జి.. రేసులో ఎవరున్నారంటే..?

టీ కాంగ్రెస్ పై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. సీనియర్లు రేవంత్ వర్గానికి మధ్య అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరడంతో.. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్ త్వరలో తప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే నాలుగైదు రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసేందుకు కొత్త వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం నియమించే అవకాశం ఉంది. కొంతకాలంగా ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై కాంగ్రెస్‌లోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఆయనకు పార్టీలోని కొందరు నేతల నుంచి సహకారం అందడం లేదు. దీంతో కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిని గత నెల 19న రాహుల్ గాంధీకి మాణిక్కం ఠాగూర్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా ఉందని ఆయన రాహుల్‌కు తెలిపారు. ఆయన రాహుల్‌కు నివేదించిన అంశాల ప్రకారం.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఒక వర్గం కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కూడా లేదు. మరోవైపు ఇటీవల ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఒక నివేదిక అందజేశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీని చక్కదిద్దాలంటే కొత్త నేత అవసరం అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో కొత్త నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ రేసులో ప్రియాంకా గాంధీ, కేసీ వేణు గోపాల్, దిగ్విజయ్ సింగ్, రణ్‌దీప్ సూర్జేవాలా, పీఎల్ పునియా ఉన్నారు. వీరిలో ఎవరు తెలంగాణ ఇంఛార్జిగా వస్తారో మరో వారంలో తేలనుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాట్సాప్ గ్రూపుల నుంచి మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారంటూ ప్రచారం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *