ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం :
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు.

నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి.
కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు నెతన్యాహు నెస్సెట్‌లో మాట్లాడుతూ ఇరాన్ అణుబాట పట్టకుండా నిరోధించడం, దేశం అంతటా నడిచేలా బుల్లెట్ రైలు ఏర్పాటు, మరిన్ని దేశాలను ‘అబ్రహాం ఒప్పందాల’ పరిధిలోకి తీసుకురావడం వంటివి జాతీయ లక్ష్యాలని పేర్కొన్నారు. నెతన్యాహుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.