నవరత్నాల అమలుపై దేశమంతా ఆరా తీస్తోంది : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నాం

రైతుల నుంచి సేకకరించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు

రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా యూనిట్ గా రైతులకు దగ్గరగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యం డబ్బులు పడేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ధాన్యం, రేషన్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి నాగేశ్వరరావు వివరించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో పౌరసరఫరాల శాఖ నిర్వహించిన వర్క్ షాపులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్ షాపులో 26 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డీఎంలు, డీఎస్‌వోలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు మాట్లాడుతూ… భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని రేషన్ డోర్ డెలివరీ అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇదే విధానంను కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చి ఆయా రాష్ట్రాల్లో రేషన్ డోర్ డెలివరీని అమలు చేసేవిధంగా పరిశీలించి వెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పై దేశమంతా ఆరా తీస్తున్నారని, లబ్దిదారులందరూ నవరత్నాల అమలు తీరుపై ఆనందపడుతున్నారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు కావాలని పనిగట్టుకుని బురద జల్లుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వర్క్ షాపులో ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి చర్చించామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, జిల్లాను యూనిట్ గా తీసుకుని రవాణా సమస్యలు తలెత్తకుండా రైతులకు దగ్గరగా ట్రాన్స్ ఫోర్టు ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా, ఆలస్యం లేకుండా, సకాలంలో రైతుకు డబ్బులు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని సేవలు అందించడానికి వీలుగా అధికారులను షిప్ట్ ల వారీగా పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు పోషక ఆహారం కోసం పోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నామని, పోర్టిఫైడ్ రైస్ ను నీటిలో కడిగినపుడు తేలుతాయని, పోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్ బియ్యంగా అపోహా పడవద్దని మంత్రి కోరారు. పోషక విలువలున్న ఆహారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం మీడియాపై ఉందన్నారు. ప్రజలకు ఇస్తోన్న బియ్యం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని తెలిపారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు ఎప్పటికప్పుడు తనీఖీలు చేస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ… రైతులకు ఆధార్ తో అనుసంధానమైన అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. కొందరు రైతులకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయని, వేరొక అకౌంట్స్ లో ధాన్యం డబ్బులు పడటం వల్ల రైతులు తెలుసుకోలేక పోతున్నారని, అలాంటి వారికోసం బ్యాంకు, అగ్రికల్చర్ అధికారులు, రైతులను కలుపుకుని ఒక మేళా నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు రైతులందరికీ ధాన్యానికి సంబంధించి చెల్లింపులు చేశామని, ఎక్కడా పెండింగ్ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ విజయ్‌ ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *