మేజర్ పురపాలికల్లో నాలా ప్రమాదాలు జరగకుండా నాలా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమం – పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు
స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ కార్యక్రమాల పైన మంత్రి కే. తారకరామారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలం నాటికి నాలాలకు సంబంధించిన రక్షణ చర్యలను, నాలా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాలాలకు సంబంధించిన విషయంలో నాలా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఈ కార్యక్రమం తర్వాత ఎక్కడెక్కడ నాలాలకు బలోపేతం మరియు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అవసరమో గుర్తించి, వాటిని పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సారి అనేక చర్యలు తీసుకున్న దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని, ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. నాలాలకు సంబంధించి ఫెన్సింగ్ మరియు ఇతర రక్షణ కార్యక్రమాలకు ఈసారి సరిపోయినంత సమయం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను పూర్తిచేయాలని, ఒకవేళ భవిష్యత్తులో నాలాల పైన దురదృష్టకర సంఘటనలు, ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులనే ఇందుకు బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. జోనల్ కమిషనర్ నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ నాలాలపై ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. నాలాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ప్రతివారం సమీక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మేయర్ నగర వ్యాప్తంగా పర్యటించి ఈ కార్యక్రమ పనులను పర్యవేక్షించాలని సూచించారు.
కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని కాకుండా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పురపాలికల్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సిడియంఎ సత్యనారాయణను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి మేజర్ కార్పొరేషన్లలోనూ నాలాల పైన రక్షణ చర్యలు తీసుకునేలా ఒక కార్యాచరణ చేపట్టాలని కేటీఆర్ కోరారు.