పుట్టిన రోజును పురస్కరించుకుని అవయవదానం చేస్తున్నట్లు వెల్లడించిన సినీ నటుడు జగపతి బాబు
కిమ్స్ ఆసుపత్రిలో అవయవదాన సదస్సు
ముఖ్య అతిథిగా జగపతిబాబు
నిజ జీవితంలోనూ హీరో అవుతానని వెల్లడి
సినిమాలోని కథానాయకులు నిజమైన హీరోలు కాదని… అవయవదానం చేసి పదిమందికి జీవితాన్ని పంచిన వారే నిజమైన హీరోలని సినీ నటుడు జగపతి బాబు అన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన అవయవదాన అవగాహన సదస్సులో జగపతిబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రేపు తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు వంద మంది అభిమానులు అవయవదానం చేస్తున్నామని తెలిపారు.ఈ నిర్ణయం తీసుకునే ముందు తన అమ్మను అడిగానని..వెంటనే తన నిర్ణయానికి సంతోష పడిందని చెప్పుకువచ్చారు. అవయవదానం చేయడం వల్ల రియల్ లైఫ్ లోనూ హీరోగా మారొచ్చని అన్నారు. మనిషి చనిపోయిన తర్వాత బూడిద తప్ప ఇంకేమీ మిగలదని, కానీ అవయవదానం చేయడం వల్ల ఏడెనిమిది మందికి పునర్జన్మ కలిగించిన వాళ్లం అవుతామని అభిప్రాయపడ్డారు. అసలు, అవయదానం చేసినవాళ్లకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించాలని సూచించారు. దేవుడు మనకు జన్మనిస్తే… అవయవదానం చేయడం ద్వారా ఎంతో మందికి పునఃజన్మ ఇచ్చిన వారమవుతామని జగపతి బాబు తెలిపారు.
అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జగపతిబాబు లాంటి వాళ్ళు ముందుకు రావడం అభినందనీయమని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
ప్రపంచంలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని…అప్పట్లో చెప్పేవారని…ఇప్పుడు అన్ని దానాలకంటే జీవనదానం ఎంతో గొప్పదని కిమ్స్ హాస్పటల్ ఎండీ బొల్లినేని భాస్కర్ రావు అన్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన వారే కాకుండా కొద్ది క్షణాల్లో చనిపోతారని తెలిసిన వారి ఆర్గాన్లను సైతం తీసుకునేందుకు ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలన్నారు. అవయవదానం పై ప్రజల్లో అపోహలు ఉన్నాయని…దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు . సినీనటుడు జగపతి బాబు తన జన్మదినం సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి స్పూర్తినిస్తుందన్నారు. సెలబ్రెటీలు అవయవదానంపై ప్రచారం చేయడం వల్ల ఎంతో మందికి అవగాహన కలుగుతుందని తెలిపారు .
ఇక అవయవదానం చేసిన కుటుంబంలో ఒకరికి ఏదైనా రోగం వస్తే …ఆ డొనర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉచితంగా వైద్యం అందించాలని కోరగా… కిమ్స్ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రావు అప్పటికప్పుడు స్పందించి ఉచితంగా సహాయం అందిస్తామన్నారు .
దేశంలో ఆర్గాన్ల కొరత ఎంతో ఉందని… ప్రజల్లో అవయవదానంపై అవగాహన లేక ఎన్నో ఆర్గాన్లు వృధా అవుతున్నాయని జీవన్ దాన్ ఇన్ ఛార్జ్ స్వర్ణ లత తెలిపారు. ఆర్గాన్ల కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు .ఈ ఏడాది ఐదువందలకుపైగా ఆర్గాన్ల ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేసి వారికి జీవితాన్ని ఇచ్చామని తెలిపారు.
అనంతరం అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన పలువురుని ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ ఇన్ ఛార్జ్ స్వర్ణలత,అక్కినేని నాగ సుశీల, వైద్యులు ,సిబ్బంది పాల్గొన్నారు.