కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రగడ.. రణరంగంగా మారిన కలెక్టరేట్

కామారెడ్డిలో నూతన మాస్టర్ ప్లాన్ అలజడి సృష్టించింది. మస్టార్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనతో పట్టణం రణరంగంలా మారింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించి ఇళ్లకు వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అన్నదాతలు.. దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేడు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 గంటలపాటు కలెక్టరేట్ ముందు అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు కామారెడ్డి రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు మద్దతు తెలిపారు. కలెక్టర్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని..కానీ కొందరు పోలీసులు రెచ్చగొట్టేలా చేస్తున్నారని అన్నారు. కొన్ని పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ అనడం సరైంది కాదన్నారు. మరోవైపు రైతుల ఆందోళనపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించారు. రైతులతో మాట్లాడేందుకు సిద్ధమేనని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ పేర్కొన్నారు. రైతుల ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.