నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.
శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. లక్షలాదిగా తరలిరానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం, వీధులన్నీ విద్యుద్దీపకాంతుల శోభతో అలరారుతున్నాయి. భక్తులకు దర్శనం, వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులతో శ్రీగిరి చందనశోభిత వర్ణంతో నేత్రశోభితంగా మారింది .బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లును అధికారులు విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500 ,శీఘ్ర దర్శనం రూ.200 , ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.
నేడు సకల దేవతల ఆహ్వానం
బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా నేటి ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకారం చుట్టనున్నారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి ఏడుగంటలకు ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.