తెలుగు భాషపై విస్తృత ప్రచారం చేద్దాం : గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

నవ్యాంధ్ర రచయితల సంఘం, మల్లెతీగ సారథ్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

విజయవాడ, మార్చి 21: కృష్ణా తీరంలో ఒకరోజు ముందుగానే ఉగాది సందడి కనిపించినట్టయింది.. అందుకు వేదికగా నవ్యాంధ్ర రచయితల సంఘం, మల్లెతీగ సారథ్యంలో మంగళవారం స్థానిక ఠాగూర్ స్మారక గ్రంథాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ కవితా దినోత్సవంతోపాటు ఉగాది ఉత్సవాల పేరిట సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి.

ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్సు గ్రహీత, గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ప్రత్యేక అతిథులుగా శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం పీఠాధిపతి కరుమారి దాసు, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఆర్.ఆర్.గాంధీనాగరాజన్, అతిథులుగా సుప్రసిద్ధ కవి, విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య, సుప్రసిద్ధ కవి, అరసం ప్రతినిధి అరసవల్లి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ సభ్యుడు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, సోషల్ యాక్టివిస్టు రజితా లహరి హాజరయ్యారు.

జాషువా కవిత్వాన్ని ప్రస్తావిస్తూ తొలి పలుకులు చేసిన జి.లక్ష్మీనరసయ్య.. వివిధ భావజాలాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తుల్ని ఒక వేదికపై నిలిపిన నిర్వాహకులను అభినందించారు.

ముఖ్యఅతిథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఉత్తేజ భరిత ప్రసంగంతోపాటు గజల్స్ ఆలపించి అలరించారు. ‘తెలుగనేది ప్రభుత్వానికి అధికార భాష కావచ్చు. ప్రజలకు మాత్రం మమకార భాషగా ఉండాల్సిన అవసరం వుంది. తెలుగుభాష కోసం ఇంకొకర్ని అడుక్కోవద్దు.. దేబిరించవద్దు. పల్లె పల్లెలో.. గడప గడపలో తెలుగుభాషని విస్తృతంగా ప్రచారం చేద్దాం.. రండి.., ‘ఎంతో నేర్పుగా ఎదిగే ప్రతిభను ఏముందంటూ నిరసిస్తే.. పురులు విప్పుకుని ఆడే నెమలిని తరిమివేసినట్టవుతుంది’ అని అన్నారు మా నారాయణరెడ్డిగారు. అది ఎంతో ప్రతిభతో ఆడుతుంటే దానిని మీరు గుర్తించకపోతే నెమలి పారిపోతుంది.. కవిత్వం రాయడం ఆగిపోతే సమాజంలో దుర్మార్గం పెరిగిపోతుంది. సృజనాత్మకశక్తి తగ్గిపోతే ఈదేశం విధ్వంసం అయిపోతుంది. అందుకనే తెలుగు సభలు పెట్టుకోవాలి.. అధికారభాషా సంఘం వుంటే ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ తెలుగుభాషా వికాసానికి, మాతృభాషా వికాసానికి అందరూ కూడా కలిసి పనిచేయాలి’ అంటూ పిలుపునిచ్చారు. కేవలం పథకాల ద్వారానే ప్రజలు మెచ్చుకోరు… మనం చేసే దానాల వల్ల ప్రజలు మెచ్చుకోరు… మన సంస్కృతి, సంస్కారాన్ని ఇవన్నీ కనుక ప్రోది చేసి పెట్టుకుంటే భాష పునాదిమీద అభివృద్ధి, సంక్షేమం ఉంటాయని డాక్టర్ గజల్ శ్రీనివాస్ అభివర్ణించారు.

‘జగన్ డిజిటల్ శోభకృత్ నామసంవత్సరం’: మందపాటి

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో గ్రంథాలయాలు గతంలో నిర్లక్ష్యంగా, నిర్వీర్యంగా పక్కకు నెట్టివేయబడ్డాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రంథాలయాల ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలిసేవిధంగా సూచనలు చేయడమేకాకుండా ఆధునికతను, సాంకేతికతను అందిపుచ్చుకునేలా లైబ్రరీ డిజిటలైజేషన్ వైపు మళ్లించడంతో గ్రంథాలయాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని గట్టిగా చెప్పగలమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,960 డిజిటల్ లైబ్రరీలకు ఆమోదం తెలియజేయడం, విజ్ఞానాన్ని గ్రామస్థాయికి అందుబాటులో తెచ్చేవిధంగా కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాదు ఈ ఉగాదికి ‘జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరం’గా గ్రంథాలయ పరిషత్ ను ప్రకటిస్తున్నట్టు మందపాటి ప్రకటించారు.

కార్యక్రమంలోభాగంగా సరికొండ నరసింహరాజు రచించిన ‘వర్ణాలు లేని వాక్యాలు’ కవితా సంపుటిని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఆవిష్కరించి తొలి ప్రతిని డాక్టర్ గజల్ శ్రీనివాస్ కు అందజేశారు. అలాగే మల్లెతీగ ఉగాది పురస్కారాలను విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు, మందరపు హైమవతి, అమూల్య చందు, డాక్టర్ ఘంటా విజయ్ కుమార్, సరికొండ నరసింహరాజు, శిఖా ఆకాష్, శ్రీమతి రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ లకు అతిథుల చేతులమీదుగా అందజేశారు. మల్లెతీగ ఉగాది యువ పురస్కారాన్ని తంగిరాల సోనికి అందజేశారు.

మధ్యాహ్నం కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితాస్త్రాలను సంధించారు. కలిమిశ్రీ, యేమినేని వెంకటరమణ, బండికల్లు జమదగ్ని, కుర్రా సురేష్ బాబు, చొప్పా రాఘవేంద్రశేఖర్ ల నిర్వహణలో జరిగిన ప్రపంచ కవితా దినోత్సవం, ఉగాది ఉత్సవాల్లో తొలుత రాయన శ్రీనివాసరావు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *