రేపు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన పీఆర్సీ సాధనా సమితి నేతలు
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం పీఆర్సీ సాధనా సమితి నేతలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఉద్యోగుల ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉద్యోగుల ర్యాలీ, సభ నిర్వహించ తలపెట్టిన బీఆర్టీయస్ రోడ్‌లో ఆంక్షలు విధించారు. అలాగే విజయవాడలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాలను నిషేధించారు. ప్రజలందరూ ఈ నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఛలో విజయవాడకు అనుమతి లేదు : విజయవాడ సీపీ కాంతి రాణా టాటా
ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు తెలిపారు. విజయవాడ సీపీ కాంతి రాణా టాటాతో పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చించారు. ఛలో విజయవాడ జరపొద్దని సీపీ చెప్పారని.. మేం ఛలో విజయవాడను జరిపి తీరుతాం అని స్పష్టం చేశాం.ఏం చర్యలు తీసుకున్నా సరే ఛలో విజయవాడ నిర్వహిస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. .