ఏడాదిలో లక్షమందికి ఉద్యోగాలు : ముఖ్యమంత్రి స్టాలిన్

చెన్నై :

డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధిశాఖ తరఫున రాయపేటలోని న్యూ కాలేజ్లో ప్రైవేటు ఉద్యోగ మేళా జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా మేళాలకు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. లక్షవ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించే అవకాశం కూడా కల్పించడం గర్వకారణమని తెలిపారు. కరోనా సమయంలో అధికారంలోకి వచ్చిన తమ సర్కారు ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. లక్ష మందికి ఏడాదిలో ఉద్యోగాలు ఇవ్వడం అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. దీనికోసం కృషి చేసిన కార్మిక సంక్షేమశాఖ మంత్రి గణేశన్ను అభినందించారు. 15 నెలల వ్యవధిలో ఆ శాఖ చేపట్టిన పలు పనులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో 65 మెగా, 817 చిన్నస్థాయి ఉద్యోగ మేళాలు నిర్వహించినట్టు తెలిపారు. 15,691 సంస్థలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగం పొందిన వారిలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లూ ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సామాజిక న్యాయమని తెలిపారు. అది ద్రావిడ మోడల్కు నిదర్శనమని పేర్కొన్నారు. ఏడాదికి లక్షమందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో కుదుర్చుకున్న పలు కార్మిక ఒప్పందాల కారణంగా సుమారు 2 లక్షల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు.

ఆ విషాదం మరెవరికీ రాకూడదు : విద్యార్థిని సత్యకు జరిగిన విషాదం రాష్ట్రంలో మరెవరికి జరగకూడదని, ఆ బాధ్యత మనకు ఉందని పేర్కొన్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాల చదువు మాత్రమే కాకుండా సామాజిక విద్య కూడా అవసరమని తెలిపారు. ఇతరులను కాపాడటాన్ని నేర్పించాలని పేర్కొన్నారు. దారితప్పకుండా పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. పురుషుడు బలవంతుడు కావచ్చని, ఆ బలం ఇతరులను నియంత్రించేలా కాకుండా మహిళలను కాపాడేలా ఉండాలని హితవు పలికారు. కార్యక్రమంలో మంత్రులు శేఖర్బాబు, సీవీ గణేశన్, మధ్య చెన్నై ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఉదయనిధి, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్, ఎంపీ గిరిరాజన్, ఉపాధి కల్పన, శిక్షణశాఖ సంచాలకులు వీర రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులోనూ విజయాలు సాధించాలి : రాష్ట్ర క్రీడాకారులు భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 36వ జాతీయ క్రీడల్లో 25 స్వర్ణ పతకాలు సహా 74 పతకాలతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాకారులు కఠోర శ్రమతో ఫలితాలను పొందారని ప్రశంసించారు. వారిని తలచుకుని గర్విస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *