ఉద్యోగ కల్పన అంటే.. సలహాదారు పోస్టులు నింపడం కాదు : జనసేన అధినేత పవన్ కల్యాణ్

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రశ్నలవర్షం కురిపించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా..? అని నిలదీశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమ వాళ్లకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం కాదంటూ హితవు పలికారు.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా..? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. నిరాశ నిస్పృహలతో యువత ఆందోళనలో ఉన్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సర శుభాకాంక్షలతోపాటు ఉద్యోగ క్యాలెండర్‌ ఇచ్చేస్తామని.. ఏటా ఆరు వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తానంటూ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే మెగా డీఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రావడం లేదని ఆక్షేపించారు. తమకు ఉద్యోగాలు ఏవంటూ కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే.. లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తుండడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని.. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని నిలదీశారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు. వాటిలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందో యువతకు వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారని.. ఆరు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియజేయాలన్నారు

బీఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవాళ్లు. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా..? అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమ వాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలని పవన్‌ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *