తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల
హైదరాబాద్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు చేరుకొని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జనసేన ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు జనసేన నేతలు..
ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.