ఆత్మ పరిశీలన చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోండి
-జస్టిస్ చంద్రకుమార్
మునుగోడు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మ పరిశీలన చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపకులు జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. పంజాగుట్ట లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా తో కలిసి ఆయన మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వ సంస్థలను అమ్ముతుందని, తెలంగాణ ప్రజల త్యాగాలతో అధికారం చేతికించుకున్న టిఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. విద్యా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ సాధారణ ప్రజలను జీవించలేని స్థితిలోకి నెట్టివేస్తున్న ఆయా పార్టీల వైఖరిని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పోటీలో ఉన్న లేకున్నా ప్రలోభాలకు లోను కాకండా ఆత్మ పరిశీలనతో ఓటు వేయండి అని ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ నే ఉంటుందని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు రాహుల్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.