ఇండిగో న్యూ ఇయర్ గిఫ్ట్.. మామూలుగా లేదుగా..!
ఇండిగో విమానయాన సంస్థ మూడు రోజుల వింటర్ సీను ప్రకటించింది. సేల్లో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

నేటి నుంచి (డిసెంబర్ 23) డిసెంబర్ 25 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తోంది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4999కే టికెట్ ధరను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి ఈ టికెట్లు లభిస్తాయని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో వెల్లడించింది. ఈ స్పెషల్ డిస్కౌంట్.. ఇతర ఏ ఆఫర్‌తోనూ గానీ, ప్రమోషన్‌తో గానీ, స్కీమ్‌తో గానీ కలిపి వర్తించదని తెలిపింది. అలాగే, ఇండిగో గ్రూప్ బుకింగ్స్ కూడా వర్తించదని పేర్కొంది. హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్లు మాత్రం అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చని చెప్పింది. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఎక్కువ మంది ప్రయాణాలకు ఆసక్తి చూపుతారని, హాలిడే సీజన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వింటర్ సేల్‌ను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతోంది. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి.